
జయకేతనం న్యూస్ ఆగస్టు 24
సూర్యాపేట జిల్లా కోదాడలో నాణ్యమైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు పనులు వేగవంతం చేయాలని భారీ నీటి పారుదల, ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కోదాడ లో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయ (JNV) నిర్మాణంపై పురోగతిని సమీక్షించారు. నవోదయ విద్యాలయ సమితి (NVS) రెండు సంవత్సరాల గడువులో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ, మంత్రి ఒకే సంవత్సరంలో పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మంత్రి క్యాంప్ ఆఫీస్లో జరిగిన ఈ సమావేశంలో భవన డిజైన్లు, ఆర్కిటెక్చరల్ లేఅవుట్లు తుది నిర్ణయాలు, నిర్మాణ కాలపట్టికల వేగవంతపై చర్చించారు. భవనాల ఎలివేషన్ నాణ్యమైన వాస్తు శిల్పం ప్రతిబింబించాలని, ప్రాంగణం విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండాలని మంత్రి తెలిపారు. మొత్తం 19.12 ఎకరాల స్థలాన్ని విద్యా భవనాలు, హాస్టళ్లు, సిబ్బంది నివాసాలు, వినోద వేదికల కోసం సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి భవన ప్రణాళికల్లో విద్యార్థులకు అనుకూలమైన మార్పులు చేయాలని సూచించారు.విద్యార్థుల సౌకర్యం, భద్రత, శ్రేయస్సు దృష్ట్యా ప్రతి సౌకర్యం ఉండాలని అధికారులకు సూచించారు.ప్రతిష్ఠాత్మక జవహర్ నవోదయ విద్యాలయం, కోదాడలోని కెఆర్ఆర్ డిగ్రీ కాలేజీ సమీపంలో 19.12 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడనుంది. కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేసింది. టెండర్లు కూడా ఫైనల్ అయ్యాయి. ఒక సంవత్సరం లోపల పాఠశాల ప్రారంభించేందుకు మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ లాజిస్టిక్ సపోర్ట్ అందిస్తున్నారని, అవసరమైన భూసమీకరణ, సామగ్రి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.జవహర్ నవోదయ విద్యాలయాలను 1986లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గ్రామీణ ప్రతిభావంతుల విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారని విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితి వీటిని నిర్వహిస్తుందని దేశవ్యాప్తంగా 650కి పైగా పాఠశాలలు నడుస్తున్నాయని JNVST పరీక్ష ద్వారా ఆరో తరగతి నుండి ప్రవేశాలు కల్పిస్తారు. జిల్లా కలెక్టర్ విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉంటారని కోదాడ JNVలో ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకు CBSE సిలబస్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య అందించబడుతుందని. ప్రతి సంవత్సరం 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారని వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, షూస్, స్కూల్ బ్యాగులు, స్టేషనరీ ఉచితంగా అందజేయబడతాయని విద్యార్థులు మరియు సిబ్బందికి పూర్తి స్థాయి నివాస సదుపాయం ఉంటుందని తెలిపారు.పాఠశాల రోజువారీ కార్యక్రమంలో ఉదయం ప్రార్థనాసభ, విద్యా తరగతులు, మధ్యాహ్నం రీమిడియల్ సెషన్లు, సాయంత్రం పర్యవేక్షిత అధ్యయన సమయాలు ఉంటాయని విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా ఈ షెడ్యూల్ రూపొందించబడిందని
జిల్లా కలెక్టర్ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి పాఠశాల నిర్మాణం సమర్థవంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, NVS హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బెరా, JNV ఖమ్మం ప్రిన్సిపల్ కే. శ్రీనివాసులు, NBCC (హైదరాబాద్) డీజీఎం అబ్దుల్ రహీమ్ మరియు ఇతర సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.









