
జయకేతనం న్యూస్ ఆగస్టు 23
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహన్ అన్నారు. శనివారం స్థానిక ప్రియదర్శని డిగ్రీ కళాశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మాదక ద్రవ్యాలను వినియోగించడం, అమ్మడం, కొనడం, నిల్వ చేయడం చట్ట విరుద్ధమన్నారు. అందుకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించబడతాయన్నారు.
హుజూర్ నగర్ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపించటం చట్ట విరుద్ధమన్నారు. అందుకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించబడతాయన్నారు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి, 21 సంవత్సరం నిండిన అబ్బాయి వివాహానికి అర్హులన్నారు. బాల్య వివాహాలలో పాల్గొన్న వారికి కూడా శిక్షలు విధించబడతాయన్నారు
హుజూర్ నగర్ స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన మాట్లాడుతూ మైనర్ బాలికలపై లైంగిక వేధింపులను నివారించడానికి ఫోక్సో చట్టం రూపొందించబడి 2012 వ సంవత్సరం నుండి ఆది అమలులోకి వచ్చింది అన్నారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్న యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష లాంటి కఠిన శిక్షలు విధించబడతాయన్నారు. బాలికలు మోసగాళ్ల మోసపూరిత మాటలకు, భౌతిక వ్యామోహాలకు లోను కాకుండా సంయమనం పాటిస్తూ భవిష్యత్తులో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కొరకు కృషి చేయాలని ఆమె సూచించారు. ఆయా కార్యక్రమాలలో ఎస్ ఐ మోహన్ బాబు, ఆయా పాఠశాలల అధిపతులు పశ్య శ్రీనివాసరెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాసరావు, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, సుంకర ప్రదీప్తి, పాలేటి శ్రీనివాసరావు, కొట్టు సురేష్, షేక్ సైదా హుస్సేన్, ఏజీపీలు రేణుకా దేవి, సురేష్ కుమార్, న్యాయశాఖ సిబ్బంది వేముల అనిత, భూక్య సుశీల, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.









